Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుపై మరోసారి స్పందించిన అమెరికా

  • న్యాయబద్ధమైన, పారదర్శకమైన, న్యాయ ప్రక్రియ సకాలంలో జరగాలని ఆశిస్తున్నట్టు పునరుద్ఘాటన
  • న్యూఢిల్లీలోని అమెరికా రాయబార ప్రతినిధికి సమన్లు జారీ చేయడంపై స్పందించిన యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్
  • కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలపైనా అమెరికా స్పందన
US Speaks Again On Arvind Kejriwal arrest in Delhi Liquor scam Case

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా విదేశాంగ ప్రతినిధికి భారత్ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం బుధవారం మరోసారి స్పందించింది. న్యాయబద్ధమైన, పారదర్శకమైన, న్యాయ ప్రక్రియ సకాలంలో జరుగుతుందని ఆశిస్తున్నట్టు పునరుద్ఘాటించింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సహా ఇతర చర్యలను నిశితంగా పరిశీలించనున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. భారత రాజధాని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో యూఎస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేస్తున్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.

కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టును అమెరికా తొలిసారి మంగళవారం ఖండించింది. ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గ్లోరియా బెర్బెనా అన్నారు. విచారణ పారదర్శకంగా ఉంటుందని, సమయానుకూల న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు చేసిన గ్లోరియా బెర్బెనాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఆయనను పిలిపించి విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్ కార్యాలయంలో బుధవారం దాదాపు 40 నిమిషాలపాటు వివరణ తీసుకుంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయడంపైనా అమెరికా స్పందన
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయడంపై కూడా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై అవగాహన ఉందని, ఈ పరిణామం ఆ పార్టీ ఎన్నికల్లో ప్రచారానికి సవాలుగా మారవచ్చని అన్నారు. అన్ని సమస్యలకు న్యాయమైన, పారదర్శకమైన, సకాలంలో చట్టపరమైన ప్రక్రియలు జరగాలని, వీటిని అమెరికా ప్రోత్సహిస్తుందని అన్నారు.

More Telugu News